కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్ల వెతలు ! 2 m ago
కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. నూతన సంవత్సరం తరగతులు ప్రారంభమై పట్టుమని 15 రోజులు గడవక ముందే కొంతమంది జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ కు గురిచేసిన ఘటన వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థులు మీసాలు, గడ్డాలు తీసేసి తరగతులకు రావాలని సీనియర్లు హుకుం చేస్తున్నారని కొంతమంది జూనియర్ విద్యార్థులు కళాశాల అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కళ్లజోడు కూడా తాము చెప్పిన తర్వాతే ధరించాలని భయపెట్టారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.
ఆకడమిక్ ఆన్ లైన్ యాప్ లు తాము చెప్పినవి తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. తరగతులు అయిన వెంటనే గుంపులు గుంపులుగా వెళ్లి క్యాంపస్ లోనే జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
యాంటీ ర్యాగింగ్ సమావేశం
మూడు రోజుల క్రితమే కాలేజీలో ర్యాగింగ్ పై ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించగా ఇందుకు ఎస్పీ బిందు మాధవ్ కూడా హాజరయ్యారు. ర్యాగింగ్ నేరమని, ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నత స్థాయి అధికారులు హెచ్చరించినా ర్యాగింగ్ కు పాల్పడటం గమనార్హం. వాస్తవంగా కర్నూలు మెడికల్ కళాశాలలో ఈ నెల 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.
గత ఏడాది కూడా ర్యాగింగ్ తో విద్యార్థుల తల్లిదండ్రులు యూజీసీకి ఫిర్యాదు చేశారు. కమిటీ నియమించి విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీని ఫలితంగానే ఈ ఏడాది మళ్లీ విద్యార్థులకు ర్యాగింగ్ తప్పడం లేదని అంటున్నారు.
గంజాయి దాఖలాలు
గత ఏడాది మెడికల్ కాలేజీ మెన్స్ హాస్టల్ లో గంజాయి కూడా లభ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మెడికల్ కాలేజీ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. అయితే, ప్రిన్సిపాల్ చిట్టి నర్సమ్మ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు తమకేమీ ఫిర్యాదు రాలేదన్నారు. హాస్టల్ కి వెళ్లి కొత్త విద్యార్థులతో మాట్లాడానని, ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థులు చెప్పలేదనన్నారు ప్రిన్సిపాల్. చెప్పడానికి విద్యార్థులకు భయం ఉంటే తనకు వాట్సాప్ లో, ఫోన్ చేసి అయినా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ర్యాగింగ్ చేసినట్లు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వచ్చిన ర్యాగింగ్ ఆరోపణలపై కమిటీ నియమించి విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు.
గతంలో ముగ్గురు బలి
దశాబ్దం క్రితం కర్నూలు మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ కేసులో ముగ్గురు విద్యార్థులను సస్పెన్షన్ చేశారు. వారిపై కోర్టులో కూడా రుజువు కావడంతో.. శిక్ష పడిన సంగతి విధితమే. ఈ ఘటన తర్వాత మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా కళాశాల అధ్యాపకులు జాగ్రత్త పడుతూ వచ్చారు. అయినప్పటికీ అడపాదడపా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతి సంవత్సరం ర్యాగింగ్ జరగకుండా కళాశాల అధ్యాపకులు, పోలీసు విభాగంతో కలిసి జూనియర్లు, సీనియర్ల మధ్య సఖ్యత కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంత నిర్వహిస్తున్న ర్యాగింగ్ భూతం మాత్రం కర్నూలు మెడికల్ కళాశాలని వదలడం లేదు.